హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం వివాదంగా మారడానికి.. ఫేక్ వీడియోలే (Fake video) కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence)ద్వారా క్రియేట్ చేసిన వీడియోలను కొందరు షేర్ చేయడం.. వాటినే సినిమా సెలెబ్రిటీలు కూడా సోషల్ మీడియాల్లో షేర్ చేయడం.. ఇంతటి రచ్చకు కారణమైందని అనుకుంటున్నారు. అందుకే.. ఈ వ్యవహారంలో ఎంతటివారున్నా సరే.. వదలొద్దంటూ ఉన్నతాధికారులకు ఆయన ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. ఫేక్ వీడియోల సంగతి తేల్చేందుకు విచారణ చేయాలని, కోర్టు నుంచి కూడా ఈ విషయంలో అనుమతి తీసుకోవాలని అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసినట్టుగా సమాచారం అందుతోంది.
అలాగే.. HCU కు సంబంధించిన ఫేక్ వీడియోలను.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy), మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(former minister Jagadish Reddy), సినిమా ప్రముఖులు జాన్ అబ్రహాం(John Abraham), దియా మీర్జా(Dia Mirza), రవీనా టాండన్(Raveena Tandon), సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ధ్రువ్ రాఠీ(Dhruv Rathi) వంటి వాళ్లు కూడా షేర్ చేశారని పార్టీ నేతలు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రులు, ఉన్నతాధికారులతో.. HCU పై నిర్వహించిన ఓ రివ్యూ మీటింగ్ లో ఈ విషయం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందన్న విషయంపైనా సుదీర్ఘంగా అభిప్రాయాలు పంచుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో మళ్లీ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించినట్టుగా టాక్ వినిపిస్తోంది.
సైబర్ క్రైమ్(cyber crime) విభాగాన్ని మరింతగా బలోపేతం చేయండి.. ఆధునిక ఫోరెన్సిక్ టూల్ ను సమకూర్చుకోండి. ఫేక్ వీడియోలు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి. విచారణకు ఆదేశించేలా ప్రభుత్వం తరఫున న్యాయస్థానాన్ని కోరండి.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త సీరియస్ గానే ఈ విషయంపై యంత్రాంగానికి ఓ రోడ్ మ్యాప్ ఇచ్చినట్టుగా అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే.. ప్రధాన ప్రతిపక్ష నాయకుల నోళ్లు కూడా మూయించేలా కచ్చితమైన వివరాలు, పూర్తి స్థాయి ఆధారాలతో సిద్ధం కావాలని కూడా దిశానిర్దేశం చేసినట్టుగా వినిపిస్తోంది. చూస్తుంటే.. ఈ వ్యవహారం.. రాను రాను మరింత రాజకీయ రచ్చకు కారణమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా.. సెంట్రల్ యూనివర్సిటీ వివాదం.. ఫేక్ వీడియోల వల్లే జరిగిందా.. లేదంటే మరేదైనా కారణం ఉందంటారా.. ఈ వివాదంలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సినీ సెలెబ్రిటీలపై.. రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపే పరిస్థితి రానుందా?