తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy).. రూట్ మారుస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాల తీరుతో.. వరుసగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తున్న వేళ.. ఆయన ఇక జనాల్లోకి వెళ్లాల్సిందే అని డిసైడయ్యారు. తాను రాష్ట్రానికి ఎంత మంచి చేస్తున్నా.. ప్రతిపక్షం బీఆర్ఎస్.. బీజేపీ(BRS and BJP)తో కలిసి జనాల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకువెళ్తున్నాయని ఆయన భావిస్తున్నారు. అందుకే.. మే నెల మొత్తం జనాల్లోనే ఉండాలని ఆయన డిసైడయ్యారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని లెక్కలతో సహా జనానికి వివరించాలని ఆయన భావిస్తున్నారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఘన విజయాన్ని అందించి.. మరోసారి అధిష్టానం దగ్గర తన సత్తా నిరూపించుకోవాలని రేవంత్ ప్రయత్నిస్తున్నట్టుగా ఈ పరిణామాల ద్వారా అర్థమవుతోంది.
ఈ క్రమంలో.. పార్టీ నేతల నుంచి తనకు అందుతున్న సహకారంపై రేవంత్ కాస్త అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. సీఎల్పీ సమావేశంలో ఆయన వ్యాఖ్యలు గమనిస్తే.. ఇది స్పష్టమవుతోంది. కొందరు ఎమ్మెల్యేలు (MLAs) వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారని రేవంత్ సీరియస్ అయ్యారు. ఎవరెవరు ప్రజల్లో ఉంటున్నారు అన్న పూర్తి వివరాలు తన దగ్గర ఉన్నట్టు చెప్పారు. ఇకపై.. శాసనసభ్యులంతా ప్రజల మధ్యే తిరగాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ(MLCs)లు కూడా తమతమ నియోజకవర్గాల పరిధిలో జనాలతో టచ్ లో ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఎంపీలు (MPs) సైతం.. తమ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని.. ప్రజలతో సంబధాలు మెరుగుపరుచుకోవాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మాత్రమే కాకుండా.. తాను సైతం మే నెల మొత్తం ప్రజల మధ్యే ఉండేలా నియోజకవర్గాల్లో పర్యటిస్తానన్నారు.
ప్రభుత్వ పరంగా తీసుకునే తదుపరి చర్యలపైనా రేవంత్.. సీఎల్పీ సమావేశంలో స్పష్టత ఇచ్చారు. వచ్చే నెల నుంచి వరుసగా ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పారు. కేబినెట్ బెర్తుల భర్తీ కూడా త్వరలో ఉంటుందన్నారు. ఈ విషయంపై అధిష్టానం నిర్ణయం రిజర్వ్ లో ఉందని.. తగిన సమయంలో హై కమాండ్ తగిన విధంగా స్పందిస్తుందని చెప్పి.. ఆశావహులకు కాస్త ఊరట కల్పించారు. ఎవరైనా సరే.. ఎంతటివారైనా సరే.. పార్టీ లైన్ దాటి మారితే వేటు తప్పదన్న స్పష్టమైన హెచ్చరికలు కూడా రేవంత్ జారీ చేశారు. పదవులు రాకున్నా కూడా.. ఎన్నోసార్లు అవకాశాలు చేతివరకు వచ్చి తిరిగి వేరే వాళ్లకు అవకాశాలు దక్కినా.. పార్టీ లైన్ మారకుండా ఉన్నందుకే.. అద్దంకి దయాకర్(Addanki Dayakar) కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కిందని ప్రశంసించారు. అలాంటి దయాకర్ ను అంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అర్హులకు తగిన సమయంలో.. పార్టీ తగిన అవకాశాలు ఇచ్చి తీరుతుందని స్పష్టం చేశారు.
ఇలా.. పార్టీ ఎమ్మెల్యేల పనితీరుతో పాటు.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనా రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు.. కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారాయి.