కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల వ్యవహారంలో.. ఎవరూ కలలో కూడా ఊహించని ట్విస్ట్ ఇది. ఇప్పటికే.. రేవంత్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని ఒకటికి రెండుసార్లు వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు.. ఈ సారి మరింత అనూహ్యంగా స్పందించింది. అనూహ్యమైన ఆదేశాలు జారీ చేసింది. చెట్లు కూలగొట్టిన ఆ వంద ఎకరాల భూముల్లో.. మళ్లీ సాధారణ స్థితిని అత్యంత త్వరగా తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. 1996 డిసెంబర్ 12న సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఎవరు ఉల్లంఘించినా.. చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది. తాము ఆ భూమి తాకట్టు, యాజమాన్య హక్కుల జోలికి ఎంత మాత్రం వెళ్లడం లేదని.. పర్యావరణ పరిరక్షణ విషయంలో జరిగిన ధ్వంసం గురించి మాత్రమే తాము స్పందిస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
సుమారు వందకు పైగా ఎకరాల్లో జరిగిన చెట్ల నరికివేత, చదును వంటి వ్యవహారాలపైనే సుప్రీం సీరియస్ అయినట్టుగా స్పష్టమవుతోంది. ఇదే విషయం ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల్లో కనిపించింది. ఆ భూముల్లో.. వన్యప్రాణుల సంరక్షణకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఏ స్థాయిలో ఉన్న అధికారులైనా సరే.. ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని ధర్మాసనం కామెంట్ చేసిందంటే.. సుప్రీం దృష్టిలో ఈ విషయం ఎంత సీరియస్ గా ఉందన్నదీ అర్థమవుతోంది. తమ ఆదేశాలపై నాలుగు వారాల్లో ప్రభుత్వం పూర్తి ప్రణాళికతో రావాలన్న సుప్రీం.. విచారణను మే 15కు వాయిదా వేసింది.
ఈ ఆదేశాలు ఇచ్చే సందర్బంగా సుప్రీం కోర్టు.. కీలకమైన వ్యాఖ్యలు చేసింది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో.. రేవంత్ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. డజన్ల కొద్దీ బుల్డోజర్లు పెట్టి వంద ఎకరాల్లో అడవిని తుడిచిపెట్టేశారంటూ సీరియస్ అయ్యింది. నిజంగా.. అక్కడ ఏమైనా నిర్మాణాలు చేయాలని అనుకుంటే.. నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుని తగిన అనుమతులు పొంది ఉంటే బాగుండేదని చెప్పింది. కానీ ప్రభుత్వం అలాంటిది ఏదీ చేయకుండా భూములను మాత్రం చదును చేసేసిందని ఆగ్రహించింది. అన్ని పరిణామాలు తెలుసుకున్న తర్వాతే.. తాము ఆదేశాలు ఇస్తున్నామని.. అతి త్వరలో ఆ ప్రాంతంలో సాధారణ స్థితి తీసుకురావాలని ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు కచ్చితమైన రీతిలో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ఈ విషయంపై.. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది.. చదును చేసిన భూముల్లో తిరిగి అంతటి భారీ స్థాయిలో చెట్లను ఎలా పెంచగలుగుతుంది.. సుప్రీం ఇస్తున్న ఆదేశాలపై ఏమైనా న్యాయపోరాటం చేసే అవకాశాలను పరిశీలిస్తుందా.. కంచ గచ్చిబౌలి భూముల వివాదం రానున్న రోజుల్లో ఇంకెలాంటి టర్న్ తీసుకోనుంది.. ఇలాంటి ప్రశ్నలన్నీ సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో.. జనాలమధ్య చక్కర్లు కొడుతున్నాయి.