ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి భార్య అన్నా లెజ్(Anna Lejnova)నోవా.. తిరుమలకు వెళ్లి స్వామివారికి మొక్కులు సమర్పించిన తీరుపై.. ప్రశంసల జల్లు కురిసింది. అంతే స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తమవయ్యాయి. క్రిస్టియన్ అయి ఉండి.. అలా ఎలా తిరుమల ఆలయంలో సంతకం పెడతారు.. హిందూ మతంపై, హిందుత్వ విశ్వాసాలపై నమ్మకం ఉందని అలా ఎలా చెబుతారు.. అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. క్రిస్టియన్ గా ఉండి.. హిందూమతాన్ని ఎలా ఫాలో అవుతారంటూ ప్రశ్నించారు. ఈ విషయం.. సీనియర్ నటి, తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి దృష్టికి వెళ్లింది. విమర్శలపై.. విజయశాంతి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి విమర్శలు ఎంత మాత్రం సరికాదని గట్టిగా బదులిచ్చి.. అన్నాకు అండగా నిలిచారు.
దేశం కాని దేశం నుంచి ఇండియాకు వచ్చిన మహిళ అన్నా లెజ్నోవా. ఆమె ఇతర మతానికి చెందినవారైనా.. హిందూ ధర్మాన్ని విశ్వసించారు. అందుకే.. తిరుమల స్వామివారిపై తన భక్తిని అలా చాటుకున్నారు. అలాంటి మహిళను గౌరవించాల్సిందిపోయి.. ట్రోల్ చేయడం సరికాదు. అనూహ్యంగా జరిగిన ఘటన నుంచి.. పవన్ కల్యాణ్, అన్నా లెజ్ నోవా కుమారుడు మార్క్(Mark) బయటపడ్డాడు. తిరుమల వేంకటేశ్వరస్వామి దయతోనే తమకు మంచి జరిగిందని ఆ దంపతులు నమ్మారు. అందుకే.. స్వామివారికి తలనీలాలు ఇచ్చి, అన్నదానానికి విరాళాన్ని ఇచ్చి.. స్వయంగా అన్నదానం చేసిన మహిళ అన్నా లెజ్ నోవా. ఒకరి సంప్రదాయాన్ని మరొకరు గౌరవించడం అన్నది చాలా గొప్ప విషయం. అలాంటి అన్నాను ఇలా ట్రోల్ చేసేవాళ్లు.. తమది తప్పు అని తెలుసుకోవాలి.. హరహర మహాదేవ్.. అంటూ సోషల్ మీడియాలో స్పందించారు.. విజయశాంతి.
అన్నా విషయంలో విజయశాంతి(Vijayashanti) చేసింది కరెక్టే అంటూ.. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. స్వతహాగా.. పవన్ కల్యాణ్ హిందూ మతానికి చెందిన వ్యక్తి. సనాతన ధర్మంపై పూర్తి విశ్వాసం ఉన్న వ్యక్తి. అలాంటి పవన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సహజంగానే.. అన్నా లెజ్ నోవా.. తన సంప్రదాయంతో పాటు.. పవన్ పాటిస్తున్న సంప్రదాయాన్ని కూడా గౌరవించడం, కొనసాగించడం అలవాటు చేసుకుని ఉంటారు. అందుకే.. తిరుమల స్వామివారిపై అంతగా భక్తిని చాటుకుని ఉంటారు. ఆ మాత్రం దానికి.. ఇంతగా ట్రోలింగ్ చేయడం అనేది కచ్చితంగా తప్పు. అలాగే.. క్రైస్తవులు ఇచ్చే క్రిస్ మస్ విందుతో పాటు.. ముస్లింలు ఇచ్చే రంజాన్ విందుకు కూడా హిందువులు హాజరవుతూ.. వారి వారి సంప్రదాయలను గౌరవిస్తుంటారని.. అలాగే.. అన్నా లెజ్ నోవా కూడా హిందుత్వాన్ని గౌరవించినట్టుగా భావిస్తే తప్పేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అనవసర రాద్ధాంతం అనేది సరికాదని స్పష్టం చేస్తున్నారు.