కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల వివాదం.. ఉన్నతాధికారులను కూడా వదలడం లేదు. ఓ వైపు.. సుప్రీం కోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతుంటే.. మరోవైపు పోలీసులు సోషల్ మీడియా పోస్టులను జల్లెడ పడుతున్నారు. తప్పుడు ఫొటోలను షేర్ చేసి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నవారిని విచారణ చేస్తున్నారు. ఈ జాబితాలోకి.. తాజాగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సభర్వాల్(IAS officer Smita Sabharwal) కూడా చేరిపోయారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి ఓ ఫేక్ ఫొటోను రీ ట్వీట్ చేశారన్న ఆరోపణలపై.. ఆమె విషయంలో పోలీసులు సీరియస్ అయ్యారు. విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12నే.. గచ్చిబౌలి పోలీసులు స్మిత సభర్వాల్ కు ఈ నోటీసులు అందజేసినట్టు తెలుస్తోంది.
గత నెల 31న.. ఓ ట్విటర్(Twitter) హ్యాండిల్ నుంచి.. కంచ గచ్చిబౌలి వివాదానికి సంబంధించిన ఓ ఫొటో ట్విటర్ లో హల్ చల్ చేసింది. అది స్మిత సభర్వాల్ దృష్టిని కూడా ఆకర్షించింది. వెంటనే.. ఆ ఫొటోను స్మిత రీ ట్వీట్ చేశారు. దీంతో.. అది మరింత వైరల్ అయ్యింది. చివరికి.. పోలీసులు ఈ వివాదానికి సంబంధించి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మిగతా ఫొటోలతో పాటు ఈ ఫొటోను కూడా అసలుదా.. నకిలీదా అని స్టడీ చేశారు. చివరికి.. అది ఫేక్ ఫొటో అని తేల్చారు. ఈ విషయాన్ని గుర్తించకుండా.. స్మిత సభర్వాల్ ఎలా రీ ట్వీట్ చేస్తారు.. అన్న విషయంపైనే ఆమెకు నోటీసులు అందినట్టుగా సమాచారం అందుతోంది.
అయితే.. అసలు, నకిలీ అన్నది తెలియకుండా.. పొరబాటుగా ఈ ఫొటో షేర్ అయి ఉండవచ్చని తెలుస్తోంది. స్మిత కూడా ఇదే మాట పోలీసులకు చెప్పే అవకాశం ఉంది. ఇందులో.. ఏమైనా తప్పు జరిగిందని తేలితే.. ప్రస్తుతం పర్యాటక శాఖ కార్యదర్శిగా ఉన్న స్మిత విషయంలో అటు పోలీసులు కానీ, ఇటు ప్రభుత్వం కానీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అసలు.. స్మిత విచారణకు హాజరవుతారా.. వెళ్తే ఏమని సమాధానం చెప్తారు.. పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు.. ఇలాంటి వివరాలపై జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంపై.. అటు పోలీసులు కానీ, ఇటు స్మిత సభర్వాల్ కానీ.. స్వయంగా స్పందిస్తే తప్ప గుసగుసలకు ఫుల్ స్టాప్ పడేలా లేదు.
పదుల ఎకరాల్లో భూములను చదును చేయడం.. దట్టంగా ఉన్న చెట్లను కూల్చేయడం.. ఈ విషయంపై సుప్రీం కోర్టు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి పరిణామాలు.. వీటికి తోడు విద్యార్థి సంఘాల నేతలు, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు చేసిన ఆందోళనలతో.. కంచ గచ్చిబౌలి భూముల విషయం.. దేశాన్నే ఆకర్షించిన వివాదంగా మారింది. ప్రస్తుతానికి రేవంత్ సర్కార్(Revanth government) ఈ విషయంలో డిఫెన్స్ లో పడినట్టే కనిపిస్తున్నా.. ముందు ముందు ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది కూడా హాట్ టాపిక్ అవుతోంది.