తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఊహలకందని రాజకీయాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పనిచేస్తూనే.. రానున్న కాలంలో తనకంటూ ఓ బలాన్ని, బలగాన్ని క్రియేట్ చేసుకునే పనిలో ఆయన పడ్డట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే.. తనను నమ్మి, తనతో కలిసి వచ్చే నేతలతో ఆయన కలిసి నడుస్తున్నట్టుగా కొందరు అనుమానిస్తున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ నేతలైతే.. పదేపదే.. బీజేపీతో కలిసి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీకి చెందిన ఓ ఎంపీ అయితే.. ప్రతిసారీ రేవంత్ నిర్ణయాలను సమర్థిస్తూ ఆయనకు అండగా నిలుస్తున్నారని కూడా చెబుతున్నారు. ఫ్యూచర్ లో.. బీజేపీతో రేవంత్ కలిసి పని చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని కూడా అంటున్నారు.
బీఆర్ఎస్ నేతలు తమ ఆరోపణలకు.. ఇటీవలి పరిణామాలను కూడా జత చేస్తున్నారు. బలమైన ఉదాహరణలు చూపిస్తున్నారు. హైడ్రా పేరుతో జరిగిన కూల్చివేతలను బీజేపీకే చెందిన తెలంగాణ ఎంపీ.. బహిరంగంగా సమర్థించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అలాగే.. ఓ ఎమ్మెల్యే కూడా రేవంత్ కు మద్దతుగా చేసిన కామెంట్లను గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలను గమనించాక కూడా.. రేవంత్ కు బీజేపీ అండ లేదని ఎలా అంటారని బీఆర్ఎస్ నేతలు స్పష్టమైన ప్రశ్నలు వదులుతున్నారు. ఎంతగా సమర్థించుకోవాలని చూసినా.. ఈ విమర్శల్లో వాస్తవం లేదని చెప్పినా.. ఇలాంటి రహస్య సంబంధాలు ఎంతో కాలం దాగవని కూడా గులాబీ దండు స్పష్టం చేస్తోంది.
రీసెంట్ గా సంచలనాన్ని సృష్టించిన కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కూడా.. బీజేపీ నేతల వైఖరిని బీఆర్ఎస్ నేతలు తప్పుబడుతున్నారు. కేంద్రం ఆధీనంలో ఉండే సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని భూముల్లో ఇంత జరుగుతున్నా.. బీజేపీ నేతలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఏ మాత్రం స్పందించడం లేదని అంటున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో.. అని కామెంట్ చేస్తున్నారు. అలాగే.. కాంగ్రెస్ లో రేవంత్ ఒంటరి అయిపోతున్నట్టు ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని.. అందుకే తనకంటూ ఓ వర్గాన్ని, బలాన్ని, బలగాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలోనే రేవంత్ రెడ్డి ఇలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టున్నారని.. అనలిస్టులు అనుమానపడుతున్నారు.