రామ్ జగదీష్(Ram Jagadish) దర్వకత్వంలో.. ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్రలో నటించగా.. ఘన విజయం సాధించిన సినిమా కోర్ట్. ఈ సినిమాపై.. సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ(Paruchuri Gopalakrishna).. తనదైన రివ్యూ ఇచ్చారు. సినిమాలో అద్భుతంగా ఉన్న విషయాలను సూక్ష్మంగా వివరించారు. అలాగే.. ఏది మిస్ అయింది అన్నది.. తన దృష్టి కోణం నుంచి చెప్పుకొచ్చారు. వందల కోట్ల భారీ బడ్జెట్లు పెట్టి సినిమాలు తెరకెక్కించి రిస్క్ చేయడం కంటే.. తక్కువ మొత్తంతోనే సినిమాలు తీసి విజయం అందుకోవచ్చని కోర్ట్ సినిమా ప్రూవ్ చేసిందంటూ.. పరుచూరి ప్రశంసించారు. దర్శక, నిర్మాతలు, రచయితలను అభినందనలతో ముంచెత్తారు. మైనర్ అమ్మాయి విషయంలో జరిగిన వ్యవహారం.. ఆసక్తికరంగా కథను నడిపించిన తీరును తన సోషల్ మీడియా చానల్ లో వివరించారు.
ఈ సినిమాను క్రైమ్ థ్రిల్లర్(crime thriller) అని కూడా అనవచ్చని.. అంత థ్రిల్లింగ్ గా సినిమాను రూపొందించారని పరుచూరి చెప్పారు. తన ఇంటికి సంబంధించిన అమ్మాయిల జోలికి ఎవరూ వెళ్లకూడదని చెబుతూ.. కఠినంగా వ్యవహరించే మంగపతి క్యారెక్టర్.. మైనర్ అయిన హీరోయిన్ క్యారెక్టర్ పై ఆయన చేయి చేసుకునే తీరు.. ఆ తర్వాత జరగాల్సిన పరిణామాలను వివరించారు. అసలు మైనర్ పై దాడి చేసినందుకు మంగపతిని సినిమాలో అరెస్ట్ చేయాలని చెప్పారు. అలాగే.. 16 నిముషాలపాటు హీరో హీరోయిన్లు గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసి ఉంటారన్నది కూడా చాలా సేపు రివీల్ చేయకుండా ఉండడం.. ఆసక్తిని కలిగించిందన్నారు. కోర్ట్ రూమ్ లో హీరో క్యారెక్టర్… హీరోయిన్ క్యారెక్టర్ ఆ విషయాన్ని వేర్వేరుగా వివరిస్తున్నప్పుడు.. కోర్ట్ రూమ్ ను ఖాళీ చేయించిన తీరు బాగుందన్నారు. మైనర్లను విచారణ చేస్తున్న సీన్లకు సంబంధించి తాను వేరే సినిమాల్లో ఇలాంటి సీన్లు చూడలేదని పరుచూరి చెప్పుకొచ్చారు.
క్లైమాక్స్ అయితే.. అద్భుతం అని.. తాను చప్పట్లు కొట్టానని పరుచూరి చెప్పారు. కానీ.. ఓ రెండు విషయాలు మాత్రమే కోర్ట్ సినిమా విషయంలో లోపంగా కనిపించాయని అన్నారు. హీరోయిన్ కుటుంబ పెద్దగా ఉన్న శుభలేఖ సుధాకర్(Shubhalekha Sudhakar) కు మరిన్ని సీన్లు పెట్టి ఉంటే బాగుండేదని చెప్పారు. అలాగే.. సినిమా చివర్లో.. హీరో హీరోయిన్లు భవిష్యత్తులో బాగా చదువుకుని గొప్పవారై పెళ్లి చేసుకున్నట్టుగా ఓ సీన్ ఉంటే ఇంకా బాగుండేదని.. సినిమా చూసినవాళ్లకు మరింత సాటిస్ఫాక్షన్ దక్కేదని అభిప్రాయపడ్డారు. ఇవి మాత్రమే సినిమాలో మిస్ అయినట్టుగా అనిపించిందని.. మిగతా అంతా అద్భుతమని చిత్ర బృందాన్ని తన రివ్యూ వీడియోలో ప్రశంసలతో ముంచెత్తారు.. పరుచూరి గోపాలకృష్ణ.
మీరు.. కోర్ట్ సినిమా చూశారా.. పరుచూరి చెప్పిన విషయాలతో మీరు కూడా ఏకీభవిస్తారా.. ఆయన చెప్పినట్టుగా ఆ రెండు విషయాల్లో చిత్ర బృందం మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేదా?