కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల కేంద్రంగా జరిగిన వివాదంలో.. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సభర్వాల్(IAS officer Smita Sabharwal).. సడన్ గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. ఈ వివాదానికి సంబంధించి.. ఓ ఏఐ ఇమేజ్ ను ఆమె రీ ట్వీట్ చేయగా.. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. అంగీకరించిన స్మిత.. పోలీసుల విచారణకు హాజరై.. తగిన రీతిలో సమాధానాలు ఇచ్చారు. ఈ విషయంపై ఆమె సోషల్ మీడియాలో అప్ డేట్ ఇచ్చారు. గచ్చిబౌలి పోలీసు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించానని తెలిపారు. అయితే.. తాను ఏఐ ఇమేజ్ ను ట్వీట్ చేసిన తర్వాత.. 2 వేల మంది అదే ట్వీట్ ను రీ ట్వీట్ చేశారని స్మిత చెప్పారు. వాళ్లను కూడా పోలీసులు విచారణ చేశారా.. వాళ్ల నుంచి కూడా వివరణ తీసుకున్నారా.. వాళ్ల విషయంలోనూ ఇలాంటి చర్యలే తీసుకున్నారా? అన్న విషయంలో తనకు స్పష్టత కావాలని ట్వీట్ లో కామెంట్ చేసి సంచలనం సృష్టించారు.
ఒక వేళ.. అలాంటి చర్యలు తీసుకోకుంటే.. ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేసినట్టు అవుతుందంటూ మరో సీరియస్ కామెంట్ చేశారు. చట్టం అందరికీ సమానమా కాదా.. అంటూ మరో సీరియస్ కామెంట్ చేశారు. దీనిపై అధికారులను స్పష్టత కోరినట్టుగా తన పోస్ట్ లో చెప్పారు. స్మిత నుంచి ఊహించని ఈ ప్రశ్నతో పాటు.. ట్వీట్ చేసిన విధానంపై పోలీసులు కూడా షాక్ తిన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎవరూ స్పందించకపోయినా కూడా.. విషయాన్ని కాస్త సీరియస్ గానే తీసుకుంటున్నట్టు సమాచారం అందుతోంది. అయితే.. ఇప్పటికే కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. సుప్రీం కోర్టు వరకూ వెళ్లి.. ప్రభుత్వంపై మొట్టికాయలు పడే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో.. స్మిత సభర్వాల్ పై కఠిన చర్యలు తీసుకుంటే.. బాగుండదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే.. ఆమెను పోలీసు విచారణ వరకు మాత్రమే పరిమితం చేసి.. తర్వాత అనువైన సమయంలో ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
ప్రస్తుతం.. రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శిగా పని చేస్తున్నారు స్మిత. ఆమె ఆధ్వర్యంలోనే.. అతి త్వరలో ప్రపంచ సుందరి పోటీలు(Miss World pageant) హైదరాబాద్ లో జరగనున్నాయి. రాష్ట్రంలోని చాలా వేదికల్లో ఈ వేడుకలను భాగం చేస్తున్నారు. నాగార్జున సాగర్, పోచంపల్లి, వరంగల్ రామప్ప దేవాలయం వంటి చారిత్రక ప్రాంతాలను ఈ వేడుకలకు వేదికలుగా చేసి భారీ స్థాయిలో కార్యక్రమాల నిర్వహణకు ప్లాన్ చేశారు. తెలంగాణ పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చే దిశగా కూడా ఈ కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇలాంటి దశలో.. ఈ బాధ్యతలను చూస్తున్న స్మిత సభర్వాల్ పై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉండకపోవచ్చని అంతా భావిస్తున్నారు. తగిన సమయంలో.. తగిన రీతిలో ప్రభుత్వం స్పందించవచ్చని అంచనా వేస్తున్నారు.
మరి.. ఈ విషయంలో ఎవరి తీరు ఎలా ఉందని మీరు భావిస్తున్నారు.. విచారణకు పిలిచిన పోలీసుల వైఖరి సమంజసమైనదేనా.. ఏఐ ఇమేజ్ ను రీ ట్వీట్ చేసిన స్మిత సభర్వాల్ చేసింది తప్పేనా.. ఆ తర్వాత ఆమె చేసిన ట్వీట్ తీరు ఎలా ఉంది..