Home Bhakthi Vasant Panchami : వసంతపంచమి.. ప్రత్యేకతలివే!

Vasant Panchami : వసంతపంచమి.. ప్రత్యేకతలివే!

vasantha panchami
vasantha panchami

ప్రకృతి ఆధారంగా వచ్చే పండగ వసంత పంచమి. తెలుగు మాసాల ప్రకారం.. మాఘ శుద్ధ పంచమి నాడు వసంతపంచమి(Vasant Panchami ) వస్తుంది. రుతువులకు సంబంధించిన పండగ అయిన కారణంగా.. ఈ పేరు వచ్చింది. ఇదే రోజున సరస్వతీ అమ్మవారి జయంతి అని శాస్త్రాలు కూడా చెబుతుండడం.. ఈ రోజును మరింత విశేషంగా.. అంతకుమించి పవిత్రంగా మార్చేసింది. ఇదే రోజును.. వసంత పంచమి అని.. శ్రీ పంచమి అని.. మదన పంచమి అని కూడా నిర్వహిస్తూ ఉంటారు. బెంగాలీలు శ్రీ పంచమి పేరుతో వసంత పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. పవిత్ర గ్రంధాలను అమ్మవారి విగ్రహం దగ్గర పెట్టి పూజించి.. సాయంత్రం ఊరేగింపుతో వేడుక చేస్తారు. రాజస్థాన్ లోనూ ఈ వేడుకను విశేషంగా నిర్వహిస్తారు. గతంలో రోమన్లు కూడా వసంతపంచమిని నిర్వహించేవారట.

ఇక.. శాస్త్రాల విషయానికి వస్తే.. బ్రహ్మ వైవర్త పురాణంలో వసంత పంచమి ప్రస్తావన ఉంది. ఇదే రోజున సరస్వతి అమ్మవారిని పూజించాలని ఆ గ్రంథం స్పష్టం చేస్తోంది. అలాగే.. కృత్యసార సముచ్ఛయం అనే గ్రంథం కూడా ఈ పండగను ప్రస్తావించింది. సరస్వతీ అమ్మవారిని ఆరాధిస్తే అక్షర కటాక్షం సాధించవచ్చని చెప్పింది. వేదాలు సైతం చదువుల తల్లి నుంచే వెలువడ్డాయని గాయత్రీ హృదయం అనే గ్రంథంలో స్పష్టంగా ఉంది. అందుకే.. వసంతపంచమిని చదువును ప్రారంభించే రోజుగా భావించి.. చాలా మంది అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. పెద్దలు కూడా.. ఏదైనా పనిని మొదలు పెట్టాలన్నా.. కొత్త చదువులు ప్రారంభించాలన్నా.. ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలన్నా.. ఇదే రోజు మంచిదని భావిస్తూ.. వసంతపంచమి నాడే వాటిని ప్రారంభిస్తూ ఉంటారు. అమ్మవారి శ్లోకాలు పఠిస్తూ పూజలు చేస్తారు. దీపావళి రోజున మహాలక్ష్మీ అమ్మవారిని.. దేవీ నవరాత్రుల్లో దుర్గామాతను పూజించినట్టుగానే.. వసంతపంచమి నాడు ప్రత్యేకంగా సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తారు. మహా కవి పోతన రాసినట్టుగా ప్రచారంలో ఉన్న.. సరస్వతీ అమ్మవారి శ్లోకాన్ని తెలుసుకుందాం.

తల్లీ నిన్ను దలంచి..పుస్తకము చేతన్ బూనితిన్
నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా సూక్తుల్
సుశబ్దంబు శోభిల్లన్ బల్కుము.. నాదు వాక్కునన్ సంప్రతిన్
జగన్మోహినీ పుల్లాభాక్షి సరసర్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా

అంటే.. తల్లీ సరసర్వతీ(Godess Saraswathi).. పుస్తకం పట్టుకునేముందు నిన్ను స్మరిస్తున్నానమ్మా.. ఆ తర్వాత చదువును ప్రారంభిస్తున్నాను.. వికసించిన కలువల్లాంటి విజ్ఞానాన్ని ప్రసాదించే తల్లీ.. నిండ చంద్రుని వంటి మోము కలిగిన చల్లని తల్లీ.. నా మనసులో నిలిచి నాతో వికాసముతో కూడిన పలుకులు అందించు.. అని అర్థం. అంటే.. సరస్వతీ మాత పూర్తిగా మనపై తన అనుగ్రహాన్ని అందించాలని కోరుతూ.. ఈ శ్లోకాన్ని చదువుతూ ఉంటారు.

అలాగే.. అందరికీ తెలిసిన సరస్వతీ నమస్తుభ్యం.. వరదే కామరూపిణీ.. విద్యారంభం కరిష్యామి.. సిద్ధిర్ భవతు మేసదా.. పద్మపత్ర విశాలాక్షీ.. పద్మకేసర వర్ణినీ.. నిత్యం పద్మాలయా దేవీ సామాంపాతు సరస్వతీ.. అని కూడా శ్లోకాలు చదువుతూ అమ్మవారిని భక్తులు కొలుస్తుంటారు. ఆ అమ్మ అనుగ్రహం కలగాలని.. చదువులో ముందునిలవాలని ప్రార్థిస్తుంటారు.

ఇక.. వసంతపంచమి గురించి మరికొన్ని కీలక విషయాలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. పురాణాల గాథల ప్రకారం.. ఈ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత.. బ్రహ్మ దేవుడు భూమికి వచ్చాడట. ఇక్కడ నిశ్శబ్దం తప్ప మరేదీ కనిపించకపోయేసరికి.. ఓ దేవదూతను సృష్టించారట. చేతిలో వీణను ధరించి ఉన్న అమ్మవారి రూపం ప్రత్యక్షమై.. మధురమైన రాగాన్ని ప్రదర్శిస్తారట. ఆ దేవదూతకే.. బ్రహ్మ దేవుడు వీణావాదిని అని.. సరస్వతి దేవి అని పేరు పెట్టారని ఓ కథ అయితే ప్రచారంలో ఉంది. ఆ రోజునే సరస్వతీ జయంతిగా పాటిస్తూ రావడం.. సంప్రదాయంగా మారింది. అందుకే.. వసంత పంచమి నాడు సరస్వతి యంత్రాన్ని ఇంట్లో పూజగదిలో పెట్టి పూజించి.. తెల్ల చందనం, పసుపు, తెలుపు పువ్వులని అమ్మవారికి అందించాలని పండితులు చెబుతారు. అలాగే.. పిల్లలకు పుస్తకాలు పంచడం ద్వారా సరస్వతి అమ్మవారి కటాక్షాన్ని అందరికీ అందించినట్టు అవుతుందని చాలా మంది భావిస్తుంటారు. ఆ సంప్రదాయం కూడా చాలాకాలంగా వసంతపంచమి నిర్వహణలో భాగంగా వస్తోంది. మరో ప్రత్యేకత ఏంటంటే.. ప్రపంచానికే జ్ఞాన ప్రదాత అయిన సరస్వతి అమ్మవారు పుట్టిన రోజు కావడంతో.. ఈ రోజు ఎలాంటి శుభకార్యాలనైనా.. ఎవరైనా నిర్వహించుకోవచ్చు.. అనే నమ్మకం కూడా ఉంది. ఇంతటి ప్రత్యేకత ఉన్న వసంత పంచమి పండుగను వైభవోపేతంగా నిర్వహించుకునేందుకు.. సనాతన ధర్మాన్ని పాటించేవారంతా ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అమ్మవారిని ఆరాధించి.. అనుగ్రహాన్ని పొందాలని ఆరాటపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here