తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy), బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్‌పై(KCR) తీవ్ర విమర్శలు గుప్పించారు. “కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలలకే రాష్ట్ర పరిస్థితి దిగజారిందా?” అంటూ ప్రశ్నించిన రేవంత్, “కొడితే బలంగా కొడతా!” అనే కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, “ముందు మీరు సరిగ్గా నిలబడండి” అని ఘాటుగా బదులిచ్చారు.”మీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. మేము రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చాం. కానీ, మీరు దిగి వెళ్లేటప్పటికి రూ.7 లక్షల కోట్ల అప్పులే మిగిల్చారు” అని కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ, “60 రోజుల్లో 25.50 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ పూర్తిచేశాం. రైతుభరోసా కింద ఎకరాకు రూ.6,000 చొప్పున మార్చి 31లోపు బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తాం” అని స్పష్టం చేశారు.










