ఏపీ అసెంబ్లీలో(AP Assembly) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) తన ప్రసంగంలో ఒక ముఖ్యమైన అంశాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో గతంలో రెండు ప్రభుత్వాలు అప్పులపై తీవ్ర చర్చలు జరిపిన నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొన్న విషయాన్ని ఉదాహరణగా తీసుకుంటూ పయ్యావుల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పయ్యావుల కేశవ్, ఆర్థిక విధ్వంసకర పరిస్థితుల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం చాలా కష్టం అని చెప్పారు. గత వైసీపీ(YCP) ప్రభుత్వంలో ప్రతి శాఖలో ఆర్థిక అరాచకాలు జరిగాయని, వాటిని సరిచేయడానికి చాల సమయం పట్టిందని ఆయన వివరించారు. ఈ అరాచకాలను నీతి ఆయోగ్ తన నివేదికలో స్పష్టంగా ప్రస్తావించిందని చెప్పారు. ఏపీ రుణ సామర్థ్యం సున్నాకు పడిపోయింది, దీంతో రాష్ట్రం అప్పు తీసుకోలేని స్థితిలో ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది.
ఇవన్నీ గుర్తుంచుకొని, దేశంలో అప్పు తీసుకునే సామర్థ్యం లేకుండా మిగిలిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచిందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ విషయంలో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు తమకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. “హిరోషిమాలో అణు దాడితో ధ్వంసమైన నగరం తిరిగి నిలబడినట్లు, ఆర్థిక విధ్వంసం అనుభవించిన ఏపీను కూడా తిరిగి నిలబెట్టవచ్చు” అన్న సీఎం మాటల స్ఫూర్తితో ఈ బడ్జెట్ రూపోందించామన్నారు. కానీ, అప్పుల విషయంలో పయ్యావుల చేసిన వ్యాఖ్యలతో, ఇక రాష్ట్రం అప్పు తీసుకోలేని పరిస్థితి లేదని స్పష్టం అయింది.