రేవంత్(Revanth reddy) ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన కార్యక్రమాన్ని.. ప్రభుత్వం కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీనే(BRS) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఏ చిన్న అవకాశం దొరికినా.. విరుచుకుపడేందుకు ఆ పార్టీ సీనియర్ నేతలు.. ముఖ్యంగా బీసీ(BC Community) వర్గాలకు చెందిన నాయకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే.. మాజీ మంత్రి గంగుల కమలాకర్.. రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా చెప్పిన 42 శాతం రిజర్వేషన్లను.. బీసీలకు అమలు చేసేవరకూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. అప్పటివరకూ వెంటాడి వేటాడుతామని హెచ్చరించారు. బీసీ డిక్లరేషన్ పేరుతో.. అధికారంలోకి వచ్చి.. ఆ తర్వాత అదే బీసీలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ కు దక్కిందన్నారు. అసలు కులగణన ప్రక్రియే.. అశాస్త్రీయంగా, అసమగ్రంగా.. ఇంకా చెప్పాలంటే అంతా కాకి లెక్కలుగా కనిపిస్తోందని చెప్పారు.
జీవో నంబర్ 26 ను కాదని.. జీవో 18ని తీసుకురావండంపైనా బీఆర్ఎస్ నేతలు గరమవుతున్నారు. జీవో 18తో.. మొత్తం వ్యవస్థనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే.. బీసీ కమిషన్, రాష్ట్ర మంత్రివర్గం, శాసనసభ కూడా జీవో 26ను ఆమోదించిందని గుర్తు చేశారు. అది కాకుండా.. మరో ఉత్తర్వులతో సర్వే చేయించడం ఏంటని ప్రశ్నించారు. అలాగే.. 2021లోనే జీవో 9 ద్వారా బీసీ కమిషన్ ఏర్పాటైందని.. 2024 జనవరి 29న ఈ కమిషన్ బీసీలపై నివేదిక కూడా ఇచ్చిందని చెప్పారు. కానీ.. కమిషన్ ఇచ్చిన నివేదకతో కాకుండా.. మరో జీవో ఆధారంగా సర్వే చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇది న్యాయస్థానాల్లో నిలవదని హెచ్చరించారు. ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ప్రభుత్వాన్ని తాము ఇప్పటివరకూ చూడలేదంటూ.. రేవంత్ రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు.
https://youtu.be/mdrqQpYPFKo