తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. కుల గణన తర్వాత బీసీల లెక్కలు తేల్చి.. ఆ వర్గానికి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వం పట్టుదలగా ఉండడమే ఇందుకు కారణమవుతోంది. మొదటి దశ సర్వే కి స్పందించని బీసీల నుంచి.. పూర్తిస్థాయిలో వివరాలు సేకరించేందుకు రెండోసారి కూడా కులగణన చేసిన ప్రభుత్వం.. ఇప్పటికి పూర్తిస్థాయిలో లెక్కలు తేల్చలేకపోయింది. ఈ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. బీసీల లెక్కలు తేలి.. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు సభ ముందు ప్రవేశపెట్టి.. అది పార్లమెంటుకు పంపి.. ఆమోదం కోసం ప్రయత్నించాలంటే.. దానికి ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అందుకే వచ్చే జూలైలో అయినా కూడా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం అనేది అనుమానంగానే కనిపిస్తుంది.
ఈ విషయాన్ని ప్రతిపక్ష BRS.. జనాల్లోకి తీసుకొని వెళుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. 2024 ఫిబ్రవరి 1నే.. స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసినా.. ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడం ఏంటంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతోంది. ఇప్పటికి 14 నెలలు పూర్తయినా కూడా ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించలేకపోతోందని విమర్శల వర్షం కురిపిస్తోంది.