జనసేనలోకి మరో నేత చేరికకు రంగం సిద్ధమైంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరనున్నారు. పెండెం దొరబాబు తన కుటుంబంతో కలిసి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సోమవారం కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను కలిసిన పెండెం దొరబాబు.. జనసేనలో చేరేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారు. పెండెం దొరబాబు ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ కూడా అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ వెల్లడించింది. దీంతో త్వరలోనే పెండెం దొరబాబు జనసేన కండువా కప్పుకోనున్నారు. పెండెం దొరబాబు రాజకీయ చరిత్రకు సంబంధించి.. బీజేపీ ద్వారా ఈయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1999 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన పెండెం దొరబాబు ఓటమి పాలయ్యారు. అయితే 2004 ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన దొరబాబు.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి మోహనరావుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.