ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు.. షాకింగ్ డెసిషన్ తీసుకుంది. కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) స్థానంలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) బాధ్యతలు తీసుకున్నాడు. మోచేతి గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గానే కాదు.. ఆటగాడిగా కూడా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తో జరిగిన మ్యాచ్ కు ముందుగానే రుతురాజ్ గాయపడ్డాడని తెలుస్తోంది. కానీ.. పంజాబ్ తో కూడా మ్యాచ్ లో ఆడిన తర్వాత గాయం పెద్దదైనట్టుగా తెలుస్తోంది. చివరికి సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) కూడా కన్ఫమ్ చేశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తో చెన్నై ఆడనున్న తర్వాత మ్యాచ్ నుంచి.. జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్ గా ధోనీ బాధ్యతలు తీసుకుంటున్నట్టుగా చెప్పాడు.
బయటికి కనిపిస్తున్నదంతా ఓకే. కానీ.. అసలు విషయమే వేరే ఏదో ఉందన్నట్టుగా రూమర్లు జోరందుకుంటున్నాయి. గత ఏడాది చెన్నై కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న రుతురాజ్ గైక్వాడ్.. ఆ సీజన్ లో కనీసం జట్టును ప్లే ఆఫ్స్ కు చేర్చలేకపోయాడు. అప్పుడే రుతురాజ్ కెప్టెన్సీ తీరుపై విమర్శలు వచ్చాయి. కానీ.. ఈ సీజన్ కు కూడా రుతురాజే చెన్నై కెప్టెన్ గా కంటిన్యూ అయ్యాడు. ఈ సారి కూడా జట్టు పరాజయాల పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ముంబైతో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో తప్ప.. వరుసగా 4 మ్యాచుల్లో చెన్నై ఓడిపోయింది. ఇలాంటి తరుణంలో.. సడన్ గా రుతురాజ్ గాయం తెరపైకి వచ్చింది. అది కూడా.. పంజాబ్ తో మ్యాచ్ కు ముందుగానే గాయమైందని తెలిసినా.. పంజాబ్ తో రుతురాజ్ మ్యాచ్ ఆడించిన తర్వాత అతని గాయం వెలుగులోకి వచ్చింది.
నిజంగానే రుతురాజ్ కు గాయమైతే.. పంజాబ్ తో మ్యాచ్ ఆడించాల్సిన అవసరం ఏమొచ్చిందని కొందరు అనుమానపడుతున్నారు. కావాలనే.. రుతురాజ్ ను తప్పించి ధోనీని కెప్టెన్ గా ముందుకు తీసుకువచ్చారా.. అని డౌట్ పడుతున్నారు. అలాంటిదేమైనా ఉంటే.. ధోనీ వంటి సీనియర్ ఆటగాడికి నాయకత్వాన్ని బదలాయిస్తున్నామని అధికారికంగా చెప్పి ఉంటే బాగుండేదని.. అప్పుడు రుతురాజ్ కూడా ఓ ఆటగాడిగా పూర్తి స్వేచ్ఛగా ఆడేవాడు కదా అని అభిప్రాయపడుతున్నారు. గాయమైందని తెలిసి కూడా.. పంజాబ్ తో మ్యాచ్ ఆడించడాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదని అంటున్నారు. ఈ విషయంపై స్వయంగా రుతురాజ్ స్పందిస్తే తప్ప ఎలాంటి స్పష్టత వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
మరి.. రుతురాజ్ విషయంలో చెన్నై మేనేజ్ మెంట్ తీసుకున్న నిర్ణయం సరైందేనా.. గాయమైందని తెలిసినా పంజాబ్ తో ఆడించడం వెనక ఏదైనా మతలబు ఉండే అవకాశం ఉందా? ధోనీ నాయకత్వంలో అయినా చెన్నై జట్టు విజయాల బాట పడుతుందా?