అనుకున్నట్టే అయ్యింది. పోసాని కృష్ణమురళి(Posani kirshna murali) యూ టర్న్ తీసుకున్నారు. తప్పంతా మరో నేతపై నెట్టేశారు. చంద్రబాబు(Chandrababu), లోకేశ్(Lokesh), పవన్ కల్యాణ్‌పై(Pawan kalyan) గతంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్(congress) అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు.. తనవి కావని.. అదంతా పార్టీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి పంపించిన స్క్రిప్ట్ అని పోలీసులకు చెప్పారు. తాను అసభ్యకరంగా దూషించానని.. తప్పుడు కూతలు కూశానని.. అయితే అందుకు కారణం మాత్రం సజ్జలే అని తేల్చారు. అలాగే.. తాను చేసిన కామెంట్లను వైసీపీ సోషల్ మీడియా నిర్వాహకుడైన సజ్జల భార్గవ్.. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశాడని చెప్పారు. రామకృష్ణారెడ్డితో పాటు భార్గవ్ ను కూడా.. అడ్డంగా బుక్ చేసేశారు.
ఇలా చెప్పడమే కాదు. నేరాన్ని అంగీకరిస్తూ పత్రాలపై పోసాని సంతకాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ లో నమోదైన కేసుకు సంబంధించి పోసాని విచారణకు హాజరయ్యారు. తాను చేసిన నేరాన్ని అంగీకరించారు. వైసీపీకి రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న క్రమంలోనే.. సజ్జల అండ్ కో ప్రోద్బలంతో ఇలా జరిగినట్టు వివరించారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య గురించి అనుచితంగా మాట్లాడానని, ఆయన అభిమానులను కావాలనే రెచ్చగొట్టానని ఒప్పుకున్నారు. చంద్రబాబుతో పాటు, లోకేశ్, కొందరు మహిళలనూ దూషించానని, వారిపట్ల అసభ్య వ్యాఖ్యలు చేశానని పోసాని.. పోలీసుల ఎదుట అంగీకరించారు. తాను చేసిన ప్రతి కామెంట్ కూడా.. సజ్జల రామకృష్ణారెడ్డి పంపిన స్క్రిప్ట్ లో భాగమే అని స్పష్టం చేశారు.