
మెగాస్టార్ చిరంజీవి చేసిన ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది. దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై 35 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, మేకర్స్ ఈ చిత్రం రీ-రీలీజ్ చేశారు. ఈ సందర్భంగా భారీగా ప్రమోషన్లు కూడా నిర్వహించారు. ఇటీవల చిరంజీవి, రాఘవేంద్రరావు, అశ్వినీదత్ కలిసి సినిమా సంగతులు గుర్తుచేసుకున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక వీడియో విడుదల చేస్తూ ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో రామ్ చరణ్ మాట్లాడుతూ, “మా తరం పిల్లలకు అసలు ఫాంటసీ సినిమానే జగదేకవీరుడు అతిలోకసుందరి. ఇందులోని ‘జై చిరంజీవా జగదేక వీరా’ పాట చూసినప్పటినుంచి నాకు హనుమంతుడిపై భక్తి కలిగింది” అని తెలిపారు. చిరంజీవి, రాఘవేంద్రరావు, శ్రీదేవి, అశ్వినీదత్, ఇళయరాజా, యండమూరి, పరుచూరి బ్రదర్స్ వంటి లెజెండ్స్ కలిసి ఈ సినిమా చేశారని, అందుకే ఇది ఒక డ్రీమ్ టీమ్ అని పేర్కొన్నారు. ఇక సినిమాకి చివర్లో చూపించిన రింగు, చేప లాంటి అంశాలకు సమాధానం కావాలని, ఇది రిక్వెస్ట్ కాదు డిమాండ్ అని నాగ్ అశ్విన్‌ను ఉద్దేశించి చెప్పారు.
ఇదిలా ఉండగా, రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో చిరంజీవి కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ వస్తే రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించాలని, అశ్వినీదత్ కుమారులు ఈ సినిమాను నిర్మించాలని అభిప్రాయపడ్డారు.
ఈ సీక్వెల్‌పై రామ్ చరణ్ వేసిన డిమాండ్‌కు నాగ్ అశ్విన్ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.









