హైదరాబాద్ అభివృద్ధిలో మెట్రో సేవలు కీలకం అవుతున్నాయి. రేవంత్ ప్రభుత్వం.. ఎలాంటి డెవలప్ మెంట్ ప్రపోజల్ చేసినా కూడా.. అందులో మెట్రో రైల్ ను భాగం చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీకి కూడా మెట్రో సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ విషయమై ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రతిపాదనలు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport) నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్ మెంట్ విశ్వవిద్యాలయం (Young India Skill Development University) వరకు.. సుమారు 40 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైలు మార్గాన్ని విస్తరించాలని భావిస్తున్నట్టు చెప్పారు. అందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇది మాత్రమే కాకుండా.. హైదరాబాద్ నగర అభివృద్ధిపై తన ముద్ర వేయాలని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి.. మరిన్ని అభివృద్ధి పనులకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించారు.
మెట్రో రెండో దశ విస్తరణపైనా సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. నాగోల్ (nagole) నుంచి శంషాబాద్ విమనాశ్రయం వరకు 36 కిలోమీటర్లకు పైగా ఉన్న మార్గం.. రాయదుర్గం (raidurg) నుంచి కోకాపేట (kokapet) నియోపొలిస్ వరకు 11 కిలోమీటర్లకు పైగా ఉన్న మార్గం.. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (Mahatma Gandhi Bus Station) నుంచి చాంద్రాయణగుట్ట (Chandrayangutta) వరకు ఏడున్నర కిలోమీటర్ల మార్గం.. మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు 13 కిలోమీటర్లకు పైగా మార్గం.. ఎల్ బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7 కిలోమీటర్ల మార్గం.. అన్నీ కలిపి సుమారు 76 కిలోమీటర్ల మేర మెట్రో సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 24 వేల 269 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేసి కేంద్రానికి పంపిన విషయంపై అధికారులతో చర్చించారు. ఆ ప్రతిపాదనల పురోగతి గురించి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అనుమతులు సాధించేవరకు శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. ఫ్యూచర్ సిటీ వంటి అభిృద్ధి ప్రతిపాదనల నేపథ్యంలో.. మీర్ ఖాన్ పేట వరకు మెట్రో విస్తరణకు ప్రతిపాదలను సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు.. ముఖ్యమంత్రి రేవంత్.
హైదరాబాద్ నగరంలోని పురాతన చెరువుల్లో ఒకటైన మీరాలం చెరువును (Miralam Lake) పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఆ చెరువు పరిధిలో ఉన్న దీవులను డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాలుగా (destination wedding centers) మార్చాలని దిశానిర్దేశం చేశారు.
నెక్లెస్ రోడ్డులోని (Necklace Road) లేక్ వ్యూ పార్క్ (Lake View Park) లో మహాత్మా జ్యోతిరావ్ పూలే (Mahatma Jyotirao Phule) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బాపూ ఘాట్ (Bapu Ghat) లో చేపట్టనున్న గాంధీ సరోవర్ (Gandhi Sarovar) పనులు, మీరాలం చెరువు (Meeralam lake)పై తీగల వంతెన నిర్మాణం (cable-stayed bridge) పనుల గురించి కూడా అధికారులను ఆరా తీశారు. వీటితో పాటు.. నగరం నలుమూలలా చేపట్టదలచుకున్న పనుల గురించి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం చర్చించారు. ఇదంతా గమనిస్తున్న తెలంగాణ ప్రజలు.. రేవంత్ చర్యలను ప్రశంసిస్తున్నారు. కానీ.. ఈ పనులను రాజకీయాల్లో ఇరుక్కుపోయేలా చేసి కాలయాపన చేయకుండా.. ప్రతిపాదనలన్నీ వాస్తవ రూపం దాల్చేలా చేస్తే.. రేవంత్ పేరు హైదరాబాద్ చరిత్రలో నిలిచిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే.. ఈ పనులన్నీ పూర్తి చేయాలని కోరుతున్నారు.