కూటమి ప్రభుత్వంలో.. జనసేన(Janasena) అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) ఒంటరైపోతున్నారు. ఆయన పరంగా.. టీడీపీ(TDP) నేతలు పరోక్షంగా ప్రదర్శిస్తున్న వైఖరి.. ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో.. ఉపముఖ్యమంత్రి పదవిని ఒక్క పవన్ కల్యాణ్ కు మాత్రమే ఇచ్చి.. మిగతా ఎవరికీ ఆ అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు(Chandrababu). ఎందుకని ప్రశ్నిస్తే.. ఆ హోదా పవన్ కు మాత్రమే ఇవ్వడం గౌరవప్రదమని, అది సామాజిక వర్గాలతో సంబంధం లేనిదని.. కొందరు టీడీపీ నేతలు కూడా బహిరంగంగానే స్పందించారు. కానీ.. రాను రాను పరిస్థితిలో స్పష్టమైన మార్పు వస్తోంది. పవన్ కల్యాణ్ వైఖరి.. టీడీపీ నేతలకు మింగుడు పడకుండా ఉంది. హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) పై చేసిన విమర్శలు మొదలు.. ఇటీవల తిరుపతిలో జరిగిన ఘటనకు సంబంధించి పవన్ కల్యాణ్ చూపించిన వ్యవహారశైలి వరకూ.. టీడీపీ నేతలు తీవ్రంగా విసుగు చెందినట్టు కనిపిస్తోంది. ఉపముఖ్యమంత్రిగా ఉన్న తానే క్షమాపణలు చెప్పినప్పుడు.. టీటీడీ బోర్డు పెద్దలు కూడా క్షమాపణ చెప్పాల్సిందే అని పవన్ చెప్పడం.. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ స్పందిస్తూ.. క్షమాపణలు చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని కామెంట్ చేయడం.. చివరికి మంత్రి లోకేశ్(Minister Lokesh) కూడా.. పవన్ వ్యాఖ్యలతో టీడీపీకి సంబంధం లేదని బహిరంగంగా చాలా స్పష్టంగా కామెంట్లు చేయడం.. ఇలా ఏది చూసినా పవన్ తీరుకు వ్యతిరేకంగానే కనిపించింది.
మరోవైపు.. టీడీపీ సీనియర్ల నుంచి కార్యకర్తల వరకూ.. అందరిదీ ఒకటే డిమాండ్. చంద్రబాబు వారించినా సరే.. ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదే జరిగితే.. పవన్ పరిస్థితి ఏంటి.. పవన్ తో పాటుగా లోకేశ్ డిప్యూటీ సీఎం అయితే.. ఇద్దరికీ ఒకే తరహా ప్రాధాన్యత ఇచ్చినట్టా.. పవన్ నూ, లోకేశ్ నూ చంద్రబాబు సమానంగా చూస్తున్నట్టా.. అన్న ప్రశ్న జనసేన వైపు నుంచి వినిపిస్తోంది. ఇదంతా.. పవన్ ను ఒంటరి చేస్తున్నట్టుగానే భావించాల్సి వస్తుందని ఆ పార్టీ క్యాడర్ బలంగా నమ్ముతోంది. అక్కడితో ఆగకుండా.. టిడీపీ కార్యకర్తలు చేసే డిమాండ్లను మించిన అభిప్రాయాన్ని జనసేన వినిపిస్తోంది. ముందు.. పవన్ ను సీఎం ను చేసి.. తర్వాత లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్.. గ్లాస్ పార్టీ నేతల నుంచి బలంగా వినిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ముందు ముందు టీడీపీ, జనసేన ప్రయాణం అన్నది.. అనుమానాస్పదమే అన్న మాట.. రాజకీయ విశ్లేషకుల నుంచి బలంగానే వినిపిస్తోంది. ఇప్పటికే.. పొత్తుల ప్రయాణానికి.. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తల వైఖరితో స్పీడ్ బ్రేకర్లు పడుతున్నాయి. ఈ తీరు ఇలాగే కొనసాగితే.. అంతర్యుద్ధం తీవ్ర స్థాయికి ముదిరి.. కూటమి మనుగడకే ముప్పు అన్న అభిప్రాయాలు జనాల నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో.. చంద్రబాబు సరైన మార్గదర్శకాలను టీడీపీ కేడర్ కు పంపించకుంటే.. రానున్న కాలంలో ప్రభుత్వానికి ఇబ్బందికరమేనన్న మాట కూడా వినిపిస్తోంది.