దేశంలో కీలక రాష్ట్రంగా ఎదుగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతిని.. పదేపదే వివరిస్తూ జపాన్ లో తీరిక లేకుండా తిరుగుతున్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy). అంతర్జాతీయ సంస్థలతో(international organizations) వరుస సమావేశాలు.. జపాన్ లోని తెలుగు సమాజంతో ప్రత్యేక భేటీలు.. అలాగే ఆ దేశంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఒసాక ఎక్స్(Osaka Expo) పో వంటి అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శనలకు హాజరవుతూ.. జపాన్ పర్యటనను విజయవంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దిశగా.. ఆయన అనుకున్న ఫలితాన్ని సాధిస్తున్నట్టే కనిపిస్తోంది. మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తో పాటు.. ఉన్నత అధికారుల బృందంతో కలిసి ఆయన రాష్ట్ర ప్రగతిని జపాన్ లో వివరిస్తున్నారు. అలాగే.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలియజేస్తూ.. రాష్ట్ర ప్రగతిలో భాగం కావాలంటూ ఆహ్వానిస్తున్నారు.
ఈ సందర్భంగా.. ఒసాక ఎక్స్ పో లో తెలంగాణ రాష్ట్ర పెవిలియన్ ను ఏర్పాటు చేసేలా రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఈ ఎక్స్ పో జరిగినంత కాలం.. తెలంగాణ పెవిలియన్ పని చేస్తుంది. అంతేకాదు.. ఈ పెవిలియన్ లో ప్రదర్శించే తెలంగాణ విశేషాలను.. అంతర్జాతీయ పత్రికల్లోనూ ప్రముఖంగా ప్రచురిస్తారని తెలుస్తోంది. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రగతితో పాటు ఇక్కడ అందుబాటులో ఉన్న పెట్టుబడుల అవకాశాలు.. అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతాయని.. రాష్ట్రానికి భారీ స్థాయిలో జపాన్ సంస్థల నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని.. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు సంతోషంగా ఉన్నారు. తమ ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రణాళికలో భాగంగా జపాన్ పర్యటన చేస్తున్నారని.. అది మంచి రిజల్ట్ ఇస్తున్నట్టుగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని పార్టీ నేతలు అంటున్నారు.
జపాన్ లో జరుగుతున్న ఒసాక ఎక్స్ పోలో.. తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు నేపథ్యంలో.. కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత ఏడాది ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనలో భాగం పంచుకోవాలని మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలు ప్రయత్నించాయని.. కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా నిర్వాహకులు ఆ ప్రతిపాదనలను తిరస్కరించారని తెలుస్తోంది. దీంతో.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు సాధ్యం కాని పనిని కాంగ్రెస్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేసి చూపెట్టిందని.. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణంగానే సాధ్యమైందని.. పార్టీ నేతలు, రేవంత్ రెడ్డి అభిమానులు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఒసాక ఎక్స్ పోలో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు ద్వారా.. రాష్ట్రానికి రానున్న కాలంలో కచ్చితంగా పెట్టుబడుల రాక భారీ స్థాయిలో తథ్యమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
అతి త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ వంటి మహా సమరాలు కూడా ముందున్నాయి. ఇలాంటి వాటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని వస్తే.. ఆ తర్వాత రాష్ట్రానికి జపాన్ దేశం నుంచి పెట్టుబడుల వరద కురిస్తే.. ఆ పరిణామాలను ఘనంగా ప్రచారం చేసుకొని.. ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. అంతేకాదు ఇటీవల వరుసగా ఎదురవుతున్న వివాదాల నేపథ్యంలో.. జపాన్ టూర్ సక్సెస్ ను.. బలంగా జనాల్లోకి తీసుకెళ్తే.. ఆ చేదు అనుభవాల నుంచి బయట పడవచ్చని ఆశిస్తున్నారు. వారి ఆశలు, అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనిది తెలియాలంటే.. మరి కొంతకాలం ఆగాల్సిందే.