
కాంగ్రెస్(Congress) అధిష్టానం సూచనలు, నిర్ణయాలకు అనుగుణంగా.. తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) విస్తరణ ప్రక్రియ ఇప్పటికే కొలిక్కి వచ్చినట్టు 2 రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకునే నేతలే కాకుండా.. పదవి పోగొట్టుకునే వారి పేర్లు కూడా జోరుగా మీడియాకు ఎక్కుతున్నాయి. ఇలాంటి తరుణంలో.. ఇన్నర్ లైన్ గా మరో చర్చను కొందరు లేవనెత్తుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో.. కొందరు మినిస్టర్లు ఫైర్ బ్రాండ్లుగా ఉన్నారు. అవసరమైతే వారు ముఖ్యమంత్రిని కూడా డోన్డ్ కేర్ అనగలరు. వారికి తోడుగా.. ఇప్పుడు మరింత మంది కేబినెట్ లో మంత్రులుగా చోటు దక్కించుకోనున్నారు.
తాజాగా వినిపిస్తున్న పేర్ల ప్రకారం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy rajgopal reddy), విజయశాంతి వంటి నేతలు మంత్రులుగా అవకాశం దక్కించుకోవడం.. దాదాపు ఖాయం. ఈ ఇద్దరూ కొంత కాలంగా రాజకీయాలు చేస్తున్న వైఖరి గమనిస్తే.. ఇటీవలే రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు చెబుతున్నారంటూ ఓపెన్ గా మాట్లాడి.. రేవంత్ ను ఇరకాటంలో పడేశారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. మంత్రి పదవి కోసం ఎంతగానో ప్రయత్నించిన రాజగోపాల్ రెడ్డి.. అవకాశం వచ్చినప్పుడల్లా తన ఫైర్ బ్రాండ్ వైఖరిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఆయన మంత్రి అయ్యాక.. రేవంత్ కు ఎలా సహకరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు.. విజయశాంతి. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె కలిసింది లేదు. కానీ.. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి.. విజయశాంతి పేరు బాగా వినిపిస్తోంది. మహిళల కోటాలో రాములమ్మకు ఈ సారి అవకాశం ఖాయమన్న మాట కూడా బలంగా వినిపించింది. ఆ వెంటనే.. ఆమెకు మండలిలో సభ్యత్వం ఖరారైంది. అప్పటినుంచీ.. విజయశాంతి మంత్రి అవడం ఖాయమని అంతా ఫిక్సైపోయారు. మరి.. ఇప్పటివరకూ సీఎంను కలవని ఆమె.. మంత్రి అయ్యాక ఎలా వ్యవహరిస్తారు.. నచ్చకపోతే మొహం మీదే చెప్పే ఆమె వైఖరితో.. రేవంత్ ఎలా వ్యవహారాలను నెట్టుకొస్తారు.. అన్నది కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతోంది.