తెలంగాణ వ్యవసాయ మంత్రిత్వ శాఖ.. మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. విత్తనాల సరఫరాలో రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేలా.. రైతు వద్దకే విత్తనాలు అన్న కాన్సెప్ట్ ను సరికొత్తగా అమలు చేయబోతోంది. పరిస్థితులన్నీ కలిసొస్తే.. వచ్చే జూన్ లోనే ఈ స్కీమ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) చెప్పారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా.. రైతులందరికీ హై క్వాలిటీ సీడ్స్ అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామం నుంచి కనీసం కనీసం ముగ్గురు నుంచి ఐదుగురు వరకు అభ్యుదయ రైతులను ఈ పథకం కింద ఎంపిక చేసి.. విత్తనాలు పంపిణీ చేస్తామని వివరించారు.
వడగళ్ల వానలు, వాటి ఫలితంగా తీవ్ర నష్టాలపాలైన రైతాంగం గురించి కూడా తుమ్మల మాట్లాడారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల వివరాలు తేలుస్తున్నామన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారంగా.. 8 వేల 408 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించామన్నారు. పూర్తి వివరాలు ఖరారు చేసుకున్న తర్వాత.. త్వరలోనే పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. గత నెలలో కురిసిన వడగళ్ల వాన, పంట నష్టం వివరాలు ఇప్పటికే తమకు అందాయన్న మంత్రి.. వాటి బాధితులకు కూడా పరిహారాన్ని సాధ్యమైనంత త్వరగా ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. రైతులు ధైర్యంగా ఉండాలని.. ఇలాంటి వాటికి భయపడి ఆందోళనకు గురికావద్దని.. వ్యవసాయానికి రేవంత్ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఒకేసారి 2 కీలక విషయాలు తెలియజేయడంతో.. తెలంగాణ రైతాంగం ఊరట చెందింది. ఇప్పటికే వడగళ్ల వానతో పంటలు నేలరాలి తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు.. ప్రభుత్వ ప్రకటనతో కాస్త తేలికపడ్డారు. అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పూర్తి స్థాయిలో గుర్తించి.. కచ్చితంగా అందరికీ ప్రభుత్వం తరఫున పరిహార సహాయాన్ని అందించాలని కోరుతున్నారు. అలాగే.. త్వరలో మొదలు కానున్న కొత్త పంటకు.. నేరుగా రైతుల దగ్గరికే విత్తనాలు వస్తున్నాయని తెలిసి అన్నదాతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో రైతుల వివరాలు సేకరించి.. అందరికీ సరిపడేలా విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చేలా పథకం ప్రణాళికలో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.