
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత మోహన్ వడ్లపట్ల తాజాగా దర్శకుడిగా మారి తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం ‘M4M’ (Motive for Murder), ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై ప్రదర్శించబడే అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఈ చిత్రం మే 17న సాయంత్రం 6 గంటలకు “PALAIS – C” థియేటర్‌లో ప్రైవేట్ స్క్రీనింగ్ ద్వారా ప్రదర్శించనున్నారు.
మోహన్ వడ్లపట్ల తన క్రియేటివ్ విజన్‌తో దర్శకుడిగా తొలి ప్రయత్నం చేస్తుండగా, ఈ చిత్రంలో ప్రముఖ అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో నటించారు. సినిమా విడుదలకు ముందే అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందుకుంటోంది.
ఇటీవల ‘Waves 2025’ ఈవెంట్‌లో జో శర్మ అమెరికన్ డెలిగేట్‌గా హాజరై బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో గుర్తింపు పొందారు. ఇక ముంబయిలోని IMPPA ప్రివ్యూ థియేటర్ వద్ద ‘M4M’ బృందం మీడియా సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ, “కేన్స్‌లో మా చిత్రాన్ని ప్రదర్శించడం గొప్ప గౌరవం. మా టీమ్ ఎంతో ఉత్సాహంగా ఉంది. త్వరలోనే ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నాం” అని తెలిపారు.
హత్యను ప్రధానంగా తీసుకొని రూపొందిన ఈ ఉత్కంఠభరిత కథనం ఇప్పటికే టీజర్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిత్రానికి అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని చెబుతున్నారు. అలాగే, హంతకుడెవరో గుర్తించే ప్రేక్షకులకు రూ.1 లక్ష లేదా 1000 డాలర్ల బహుమతి ఇవ్వనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.