
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న ఈ సమయంలో, కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్న బాంబు బెదిరింపు కాల్ ఒక కలకలాన్ని రేపింది. మంగళవారం మధ్యాహ్నం, కోల్‌కతా నుంచి ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్లో సమాచారం ఇచ్చాడు. విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉండగా ఈ సమాచారం రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. విమానాన్ని ఐసోలేషన్ బేకి తరలించి, ప్రయాణికులను దింపి, వారి సామాను పూర్తిగా తనిఖీ చేశారు. బాంబు స్క్వాడ్ సహా భద్రతా బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఇది తెలుసుకున్న ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనతో వెంటనే కోల్‌కతా విమానాశ్రయం పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. విమానంలో 195 మంది ప్రయాణికులు ఉండగా, మధ్యాహ్నం 1:30కు ముంబైకి బయల్దేరాల్సి ఉండేది. ఈ బెదిరింపుతో అధికారులు అత్యవసర చర్యలు తీసుకున్నారు. సీఐఎస్ఎఫ్ భద్రత బలగాలు విమానాశ్రయం మొత్తం తనిఖీ చేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రతి కదలికను నిశితంగా గమనించారు. వేగంగా స్పందించిన అధికారుల చర్యలతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఇది ఇటీవలి రోజుల్లో రెండో బాంబు బెదిరింపు ఘటన కావడం విశేషం. మే 6న ఛండీగఢ్ నుంచి ముంబైకి వెళ్తున్న ఇంకొక ఇండిగో విమానానికి కూడా ఇలాంటిదే కాల్ వచ్చింది. ఆ కాల్‌ను కూడా తప్పుడు సమాచారం గానే గుర్తించారు. కోల్‌కతా ఘటనలో కూడా బాంబు లభించకపోయినప్పటికీ, దేశంలో నెలకొన్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఈ తరహా ఘటనలు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నాయి. నిర్ధిష్ట ఆధారాల్లేని బెదిరింపులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, సత్వర స్పందన వల్ల ప్రమాదాన్ని నివారించగలిగారు.