ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి(Peddi ramchandra reddy) బ్యాడ్ టైమ్ మొదలైనట్టుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధికారంలో ఉన్నప్పుడు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించిన పెద్దిరెడ్డి.. అటవీ భూములను కబ్జా చేశారంటూ(Land Encroachment) ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఆ వెంటనే.. ప్రభుత్వం ఆగమేఘాల మీద అలర్ట్ అయ్యింది. స్వయంగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) కలగజేసుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. క్షణాల్లో.. జాయింట్ కమిటీ ఏర్పాటైంది. ఇందులో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్, ఎస్పీ మణికంఠ, ఐఎఫ్ఎస్ అధికారి యశోదబాయి వంటి ఉన్నతాధికారులు ఉన్నారు. కమిటీ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ.. ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
పుంగనూరు శాసనసభ నియోజకవర్గం పులిచర్ల మండల పరిధిలోని మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని అటవీ భూములను పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందంటూ ఆరోపణలు వెలుగుచూశాయి. సుమారు 75 ఎకరాల భూ ఆక్రమణలపై.. అధికారులు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇది సీఎం చంద్రబాబు చేతికి కూడా అందినట్టు సమాచారం. ఈ వ్యవహారంపైనే.. తాజాగా ఏర్పాటైన జాయింట్ కమిటీ పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే పెద్దిరెడ్డి కేంద్రంగా తీవ్రమైన ఆరోపణలు రావడం.. ప్రభుత్వం ఆగ్రహంతో స్పందించడం చూస్తుంటే.. త్వరలోనే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు అర్థమవుతోంది. ఆరోపణలు ఏ మాత్రం రుజువైనా.. అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యమైనా.. ఏమాత్రం ఉపేక్షించకూడదని చంద్రబాబు సర్కారు నిర్ణయించినట్టుగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ వ్యవహారం ముగిసిన తర్వాత.. మిగతా మాజీ మంత్రులపైనా ప్రత్యేక నజర్ పెట్టేందుకు టీడీపీ(TDP) సిద్ధమవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ముందు.. పెద్దిరెడ్డి వ్యవహారం తేలితే.. ఆ తర్వాత.. కొడాలి నాని, అనిల్, రోజా, పేర్ని నాని, మరి కొందరు మాజీ మంత్రులు.. ప్రత్యేకంగా వల్లభనేని వంశీ.. ఇలా గట్టి లైనప్పే టీడీపీ చేతిలో ఉండి ఉండవచ్చని గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు, లోకేశ్(Lokesh) ను ఉద్దేశించి వీరు గతంలో చేసిన విమర్శలు, సాక్షాత్తూ శాసనసభ సాక్షిగా చేసిన రాజకీయాలు కూడా.. పార్టీ పెద్దల మనసుల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే.. మొదటి వికెట్ పెద్దిరెడ్డి రూపంలో పడే పరిస్థితులు ఏర్పడ్డాయని ఏపీ రాజకీయాలు విశ్లేషిస్తున్న వాళ్లంతా అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత కూడా.. వచ్చే రెండు మూడేళ్ల పాటు.. గత ప్రభుత్వ మంత్రుల వ్యవహారాలను బయటికి తీయడం.. ఆ తర్వాత రాబోయే ఎన్నికలకు సిద్ధమై జనాల్లోకి వెళ్లడం అన్నది.. చంద్రబాబు అండ్ లోకేశ్ చేస్తున్న ప్రయత్నంగా అంచనా వేస్తున్నారు.
మరోవైపు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan kalyan) సైతం పెద్దిరెడ్డి వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. అటవీ భూముల ఆక్రమణల వ్యవహారంపై పవన్ కల్యాణ్ కూడా సీరియస్ గా స్పందించారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అధికారిని విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. అటవీ భూములు పెద్దిరెడ్డి కుటుంబసభ్యుల పేరుపైకి ఎలా వెళ్లాయి.. రికార్డుల తారుమారు జరిగిందా.. అన్నది స్పష్టంగా తేల్చాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. అంతిమంగా.. లబ్ధి పొందింది ఎవరో కూడా తేల్చాలని చెప్పారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే.. పెద్దిరెడ్డి అడ్డంగా బుక్కైపోయినట్టే కనిపిస్తోంది. ఆయనకు పార్టీ పరంగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎలాంటి అండ లభిస్తుందన్నది చర్చనీయాంశమైంది. జగన్.. ఈ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కొంటారు.. మిగతా నేతలను ఎలా కాపాడుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.ఓవరాల్ గా.. పెద్దిరెడ్డితో మొదలైన ఈ వ్యవహారమైతే.. మిగతా నేతలను కూడా ఇరకాటంలో పడేసే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సాధారణ ప్రజలు కూడా అనుకుంటున్నారు.









