కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komati Rajgopal Reddy).. మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు. ఈ సారి ఏకంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) తీరును తప్పుబట్టారు. కాంగ్రెస్(Congress) సీనియర్ నేత అయి ఉండీ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలనే దుయ్యబట్టారు. ప్రజలు ఇప్పటికీ గత ముఖ్యమంత్రినే పొగుడుతున్నారంటూ.. కేసీఆర్ పై పరోక్షంగా ప్రశంసలు గుప్పించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథక రూపకల్పన సరిగ్గా లేదంటూ విమర్శలు చేశారు. రుణ మాఫీ, రైతు బంధు అందలేదని గ్రామాల్లో చాలా మంది ఇప్పటికీ ప్రస్తుత ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. పథకాలను నిబంధనలు రూపొందించేముందు సరిగా కసరత్తు చేయాల్సి ఉందని.. ఆ దిశగా సరైన పని జరగలేదని రాజగోపాల్ రెడ్డి కామెంట్లు చేయడం.. కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేసింది.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మసీదుగూడెంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన ఏ ఒక్క పథకాన్ని కూడా సమర్థంగా అమలు చేయలేకపోతున్నామని అర్థం వచ్చేలా కామెంట్లు చేశారు. గ్రామ సభల్లో కూడా ఉన్నతాధికారులను ప్రజలు నిలదీస్తున్న సందర్భాలు ఇటీవల చూశామని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో అమలైన రైతు బంధు పథకాన్ని ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా అని మార్చిన విషయాన్ని కూడా రాజగోపాల్ రెడ్డి.. మరిచిపోయినట్టుగా మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు బంధు సహాయాన్ని 15 వేల రూపాయలకు పెంచుతామని చెప్పినట్టు గుర్తు చేశారు. వెంటనే పక్కనున్న నాయకులు.. ఇప్పుడు రైతు భరోసా అని గుర్తు చేశారు. దీంతో.. ప్రభుత్వం పేరు మార్చిన విషయాన్ని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ హామీని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నామంటూ.. రేవంత్ రెడ్డి అసమర్థుడని చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే.. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలకు పెట్టిన అర్హత నిబంధనలను కూడా రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు. ఉపాధి హామీ పథకం పనుల్లో కనీసం 20 రోజులు పని చేస్తేనే డబ్బులు ఇస్తామని నిబంధన పెట్టడం కూడా సరికాదన్నారు.
రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని కాస్త జాగ్రత్తగా గమనిస్తే.. ఈ సారి మాత్రం ఆయన చాలా స్ట్రాటజీతో మాట్లాడినట్టే కనిపిస్తోంది. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా.. మంత్రి పదవిపై ఆసక్తిని వ్యక్తపరిచే అలవాటున్న ఆయన.. ఈ సారి పూర్తిగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేందుకే అవకాశం తీసుకున్నట్టు స్పష్టమైంది. గ్రామాల్లో అధికారులను ప్రజలు నిలదీస్తున్నారని, కేసీఆర్ పాలనపైనే ప్రశంసలు ఇప్పటికీ కురిపిస్తున్నారని చెప్పడంతో.. రేవంత్ ను డిఫెన్స్ లో పడేశారని కూడా చెప్పొచ్చు. ఇప్పటికైనా.. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుంటే.. భవిష్యత్తులో రేవంత్ కు కష్టమే అన్న భావన కూడా.. తాజా పరిణామంపై ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. ఇప్పటికే రేవంత్ కు పార్టీ పరంగా అప్పుడో ఇప్పుడో సెగ తాకుతూనే ఉంది. జగ్గారెడ్డి రూపంలో ఓ సారి.. రాజగోపాల్ రెడ్డి రూపంలో మరోసారి.. వీహెచ్ రూపంలో ఇంకోసారి.. అద్దంకి దయాకర్ ఇలా ఎప్పుడు ఎవరు ఏ రకంగా మాట్లాడుతారు.. రేవంత్ ను ఎలా ఇరకాటంలో పెడతారు అన్నది.. అర్థం కాకుండా ఉంది. అంతే కాక.. సాక్షాత్తూ కొందరు మంత్రులు కూడా.. అవకాశం దొరికితే రేవంత్ ను ఇరికించేద్దామని కూడా రెడీగా ఉన్నట్టుగా అప్పుడప్పుడు సంకేతాలు వెలువడుతుంటాయి.
ఇదంతా.. ఎందుకంటే.. అది కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీలోనూ కనిపించని అంతర్గత ప్రజాస్వామ్యం ఆ పార్టీలో జాతీయ అధినేత నుంచి సాధారణ కార్యకర్త వరకూ అణువణువూ కనిపిస్తూ ఉంటుంది. అదే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలిట శాపంగా మారినట్టు అనిపిస్తోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణ తర్వాత.. అసంతృప్తుల నుంచి రేవంత్ కు మరింత ఇబ్బందిరక పరిణామాలు తప్పవన్న అభిప్రాయం ఇప్పటినుంచే కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. తాజాగా.. రాజగోపాల్ రెడ్డి రూపంలో ఆ ప్రభావం కనిపించడం మొదలైంది. ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు.. తనపై ఎదురవుతున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు.. పార్టీలో పట్టును, బలాన్ని పెంచుకునేందుకు ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ గందరగోళానికి త్వరగా ఫుల్ స్టాప్ పడాలని కోరుకుంటున్నారు. మరి.. రాజగోపాల్ రెడ్డి కామెంట్లను ఎలా చూడాలి.. వీటి ప్రభావం భవిష్యత్తుపై ఎలా ఉండబోతోంది..