
వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ అయిన విజయసాయిరెడ్డి(Vijay sai reddy).. మరోసారి సంచలనానికి కేంద్రంగా నిలిచారు. పార్టీని వీడేందుకు దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ.. ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కాకినాడ పోర్టులో అక్రమాల కేసుకు సంబంధించి విచారణకు హాజరైన ఆయన.. మీడియాతో మాట్లాడారు. తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ.. అనూహ్య విషయాలను వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ చుట్టూ ఓ కోటరీ ఉందని.. దాని నుంచి బయటపడితే తప్ప జగన్ కు మళ్లీ మంచి భవిష్యత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఆ కోటరీ కారణంగానే జగన్ కు తాను దూరమయ్యానన్న విజయసాయి.. నాయకుడు అనే వాడు చెప్పుడు మాటలు వింటే ఏ పార్టీకి అయినా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని అన్నారు.
కాకినాడ పోర్టు(Kakinada port) అక్రమాల వ్యవహారంలో తాను చేసిందేమీ లేదని.. అనవసరంగా తనను ఏ2 గా చేర్చారని విజయసాయి చెప్పారు. కేసు నమోదు చేసినప్పుడు తాను వైసీపీలో ఉన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. ఇప్పుడు మాత్రం తనకు అన్నీ తెలిసొచ్చాయని అన్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఏం జరిగిందనేది వైసీపీని వీడిన తర్వాతే అర్థమైందని తెలిపారు. కేసులో కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డే అని తేల్చిన ఆయన.. ఈ కేసు ఇక్కడితో ఆగినా ఆగకున్నా తనకు వచ్చే నష్టం ఏదీ లేదని అన్నారు. కేవీ రావు, శరత్ చంద్రారెడ్డి అనే ఇద్దరికి డీల్ చేసింది విక్రాంత్ రెడ్డే తప్ప.. తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. తాను కేవీ రావుతో మాట్లాడినట్టు నిరూపించాలి సవాల్ చేశారు.